పోలీస్ పవర్.. చెప్పుతో వికృత చేష్టలు
“చట్టం చుట్టం కాదు.. అంతకంటే ముందు క్రమశిక్షణ ముఖ్యం.” కానీ, కృష్ణా జిల్లాలో జరిగిన ఒక ఘటన చూస్తుంటే ఆ మాటలు కేవలం పుస్తకాలకే పరిమితమనిపిస్తోంది. తన భర్త పోలీస్ అనే అహంకారమో.. లేక సామాన్యుల పట్ల చులకన భావమో తెలియదు కానీ, ఒక మహిళ నడిరోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేసిన ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.|
అసలేం జరిగింది?
శుక్రవారం మోపిదేవి మండలం పులిగడ్డ నాలుగు రోడ్ల కూడలి వద్ద విజయవాడ కరకట్ట బస్సు కోసం కొందరు ప్రయాణికులు వేచి ఉన్నారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల డ్రైవర్ అక్కడ బస్సు ఆపలేదు. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? మరో బస్సు కోసం వేచి చూస్తారు. కానీ, ఆ మహిళ మాత్రం “నన్నే దాటుకుని వెళ్తావా?” అన్నట్టుగా పట్టువదలని విక్రమార్కుడిలా బైక్‌పై బస్సును వెంబడించారు.
సినిమా ఫక్కీలో అడ్డగింత
సుమారు 6 కిలోమీటర్ల మేర ఛేజ్ చేసి, మోపిదేవి టెంపుల్ వద్ద బస్సును అడ్డుకున్నారు. బస్సు ఆగడమే ఆలస్యం.. నేరుగా డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి రభస మొదలుపెట్టారు. మాట మాట పెరగడంతో, నిగ్రహం కోల్పోయిన సదరు మహిళ తన కాలి చెప్పు తీసి డ్రైవర్‌పై ఎడాపెడా దాడి చేశారు. అంతటితో ఆగకుండా, చల్లపల్లి వరకు బస్సును ఫాలో అయ్యి, అక్కడ తన బంధువును పిలిపించి మరీ మరోసారి దాడి చేయించడం గమనార్హం.
ఖాకీ నీడలో రాజీ పర్వం?
ఈ ఘోరంపై ఆర్టీసీ సిబ్బంది మండిపడుతున్నారు. బాధితుడు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనా, దాడి చేసిన మహిళ ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య కావడంతో సీన్ రివర్స్ అయింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఈ వివాదం, కాసేపటికే ‘రాజీ’ ముసుగులో కప్పెట్టేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ కుటుంబమే ఇలా రోడ్డుపై దాష్టీకానికి దిగితే, సామాన్యుడికి రక్షణ ఎక్కడ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదా మనం కోరుకున్న సమాజం?
బస్సు ఆపలేదని ఆగ్రహం రావడం సహజం, కానీ దానికి నిరసన తెలపడానికి మార్గాలు ఉన్నాయి. డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేయవచ్చు లేదా ఉన్నతాధికారులకు చెప్పవచ్చు. కానీ, ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్‌పై ఇలా చెప్పుతో దాడి చేయడం అరాచకత్వానికి పరాకాష్ట.
“మీ ఆయన పోలీసైతే మాత్రం.. బస్ డ్రైవర్‌ను చెప్పుతో కొడతావా తల్లీ! ఇదేం ఘోరం?” అని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బాధితుడికి న్యాయం చేస్తారో లేక ‘ఖాకీ’ బంధుత్వానికే ప్రాధాన్యత ఇస్తారో వేచి చూడాలి.












Leave a Reply