ఒక వేటగాడు తన పొట్టకూటి కోసం అడవి నుంచి ఒక కుందేలును వేటాడి తెచ్చి సంతలో పెడితే, జనం దానికి ఒక ధర కట్టి కొనుగోలు చేస్తారు. ఆ చిన్న ప్రాణి శరీరం వల్ల వేటగాడికి అన్నమో, గంజియో లభిస్తుంది. అంటే సమాజంలో బతికున్నా, చనిపోయినా ఒక చిన్న కుందేలు శరీరానికి కూడా ఒక నిర్దిష్టమైన విలువ ఉంటోంది. కానీ ఈ భూమిని ఏలిన మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఎంత వైభవంగా జీవించినా, ఒకసారి మరణించాక అతని శరీరాన్ని ఉచితంగా ఇస్తామన్నా ఎవరూ తీసుకోవడానికి ముందుకు రారు.
మన ఇంట్లోనే ఎంతో మందిని చూస్తుంటాం. వారు జీవించి ఉన్నంత కాలం ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటాం, కానీ మరణించిన తర్వాత ఆ మృతదేహంతో పాటు ఎవరూ వెళ్లలేరు. ఒక రోజు ఇంట్లో ఉంచిన శరీరాన్ని మరుసటి రోజుకల్లా మట్టిలోనో, స్మశానంలోనో కలపక తప్పదు. ఇంకొన్ని గంటలు గడిస్తే ఆ శరీరం దుర్వాసన వెదజల్లుతుంది. అప్పుడు ఒక చిన్న జంతువు శరీరంకున్న విలువ కూడా చనిపోయిన మనిషి శరీరానికి లేదనే చేదు నిజం మనకు బోధపడుతుంది.
మనిషి జీవితం, శరీరం ఎంత అశాశ్వతమైనవో ఈ వాస్తవాలే చెబుతున్నాయి. పుట్టుకతో వచ్చే అందం, హోదా, సంపద ఏవీ శాశ్వతం కావు. ఈ నిజాన్ని గ్రహించి మనిషి తనలోని అహంకారాన్ని వీడాలి. భౌతిక సుఖాల కోసమే కాకుండా, ఈ జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. కేవలం శరీరాన్ని పోషించుకుంటూ బతకడం వల్ల మానవ జన్మకు ఎలాంటి ప్రత్యేకత ఉండదని, చావు తర్వాత మిగిలేది మనం బతికిన విధానం మాత్రమేనని తెలుసుకోవాలి.
ఈ అశాశ్వతమైన మానవ జన్మకు నిజమైన విలువ, గౌరవం రావాలంటే భగవంతుణ్ణి విశ్వసించి ధర్మమార్గంలో నడవాలి. మంచి ఆచారాలు, సత్ప్రవర్తన, ప్రేమ, కరుణ, దయ, సేవ వంటి సద్గుణాలను జీవితంలో నింపుకోవాలి. కుందేలు శరీరం చనిపోయినా ఒకరి ఆకలి తీరిస్తే, మనిషి శరీరం చనిపోయాక దేనికీ పనికిరాదు. అందుకే బతికున్నప్పుడే సమాజానికి మేలు చేస్తూ, సన్మార్గంలో నడిచినప్పుడే ఆ మనిషి జీవితం ధన్యమవుతుంది మరియు మరణానంతరము అతని పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.












Leave a Reply