ఆదివారం: సెలవు దినం దాగి ఉన్న అసలు రహస్యం!

నేడు మనం ఆదివారాన్ని కేవలం వినోదానికి, విశ్రాంతికి పరిమితం చేస్తున్నాం కానీ, ప్రాచీన కాలంలో ఇది అత్యంత శక్తివంతమైన ఉపాసన దినం. అప్పట్లో మన దేశంలో ఆదివారం సెలవు ఉండేది కాదు. కేవలం నెలకు రెండు రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి నాడు మాత్రమే విరామం ఇచ్చేవారు. అందుకే ఇప్పటికీ అరుదుగా జరిగే పనుల గురించి “అమావాస్యకో పున్నమికో” అనే నానుడి వాడుకలోకి వచ్చింది. నేటి ఆదివారం సెలవు విధానం ఆంగ్లేయుల పాలనతోనే మొదలైంది.

మన పూర్వీకులు ఆదివారాన్ని సూర్యారాధనకు కేటాయించేవారు. భారతీయుల మేధస్సుకు, ఆత్మస్థైర్యానికి ఈ సూర్య దీక్షలే మూలమని గుర్తించిన బ్రిటిష్ వారు, మనల్ని ఆ ఆధ్యాత్మిక శక్తికి దూరం చేసేందుకు కుట్ర పన్నారని అంటారు. అందుకే బలవంతంగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి, మనల్ని విలాసాల వైపు మళ్ళించారు. ఫలితంగా నాటి సుదినం నేడు కేవలం మందు, మాంసాల రోజైపోయింది.

విద్యార్థుల విషయానికి వస్తే, గురుకులాల్లో పక్షానికి నాలుగు రోజులు అంటే పాడ్యమి, అష్టమి, చతుర్దశి మరియు అమావాస్య/పూర్ణిమలను ‘అవిద్య’ దినాలుగా పరిగణించేవారు. ఈ రోజుల్లో కొత్త పాఠాలు నేర్పేవారు కాదు. ముఖ్యంగా పాడ్యమి నాడు చదువుకు విరామం ఇచ్చేవారు. రామాయణంలో సీతమ్మ దైన్యాన్ని వర్ణిస్తూ, పాడ్యమి నాడు చదివే వాడి విద్యలా ఆమె శరీరం శుష్కించిపోయిందని వాల్మీకి మహర్షి పేర్కొనడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

సూర్యారాధన అనేది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు; మన నుండే ఈ సంస్కృతి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. పూర్వం దుకాణాలు కూడా తిథుల ప్రకారమే మూసివేసేవారు. సూర్యాష్టకం ప్రకారం ఆదివారం నాడు తైలభ్యంగనం (నూనె స్నానం), మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. అలా నియమంగా ఉండేవారికి అనారోగ్యం, దారిద్ర్యం దరిచేరవని, వారు సూర్యలోకాన్ని పొందుతారని శాస్త్రం చెబుతోంది.

మన కర్మవశాత్తూ ఏ పనులైతే చేయకూడదని శాస్త్రాలు హెచ్చరించాయో, నేడు ఆదివారం నాడు అవే పనుల్లో మనం మునిగిపోతున్నాం. అందరిలో మార్పు రావడం కష్టమైనా, ఈ విషయాన్ని గుర్తించిన కొద్దిమంది అయినా తిరిగి మన సంప్రదాయ మార్గంలో నడవాలని ఆశిద్దాం. ఆదివారాన్ని కేవలం జల్సా దినంగా కాకుండా, మన శక్తిని పుంజుకునే పవిత్ర దినంగా మార్చుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *