మన జీవితాన్ని నడిపించేది ఏది?

మన జీవితంలో జరిగే మంచి చెడులకు, సుఖఃదుఖాలకు అసలు కారణం ఏంటి? బ్రహ్మదేవుడు రాసిన తలరాతనా, గ్రహచారమా, వాస్తు దోషమా లేక దేవుడు ఆడిస్తున్న నాటకమా? సృష్టికర్త అయిన బ్రహ్మ అందరికీ సమానమైనప్పుడు ఒకరిని ధనవంతుడిగా, మరొకరిని పేదవాడిగా ఎందుకు పుట్టిస్తాడు? దేవుడు పక్షపాతి కానప్పుడు సమాజంలో ఈ అసమానతలకు కారణం ఆయన ఆడిస్తున్న నాటకం అని చెప్పలేం. అలాగే గ్రహచారం, వాస్తు లేదా విధి అనే శక్తులు కూడా వాటికై అవి సొంత ఇష్టాయిష్టాలతో ఎవరి జీవితాలనూ మార్చలేవు. మనం కోరుకున్నవన్నీ జరిగిపోవడానికి జీవితం మన ఇష్టానుసారం కూడా నడవదు. వీటన్నింటినీ లోతుగా పరిశీలిస్తే, మన జీవిత గమనాన్ని శాసించే ఏకైక పరమార్థం “కర్మ సిద్ధాంతం” మాత్రమేనని స్పష్టమవుతుంది.

కర్మల రకాలు.. మనల్ని వెంటాడే ప్రారబ్ధ, ఆగామి, సంచితాలు

హిందూ తత్వశాస్త్రం ప్రకారం కర్మలు ప్రధానంగా మూడు రకాలు: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. గత జన్మల నుండి మనం మూటగట్టుకున్న మొత్తం కర్మల నిల్వను ‘సంచిత కర్మ’ అంటారు. ఈ నిల్వలో నుండి ప్రస్తుత జన్మలో మనం అనుభవించడం కోసం తెచ్చుకున్న భాగాన్ని ‘ప్రారబ్ధ కర్మ’ అంటారు. దీనివల్లనే మన పుట్టుక, ఆరోగ్యం, పేదరికం లేదా ధనయోగం వంటివి నిర్ణయించబడతాయి. ఇకపోతే ఈ జన్మలో ప్రస్తుత మన ఆలోచనలు, పనుల ద్వారా భవిష్యత్తు కోసం మనం కొత్తగా చేసే కర్మలను ‘ఆగామి కర్మలు’ అంటారు. ఈ విధంగా మనం అనుభవిస్తున్నవి, అనుభవించబోయేవి అన్నీ ఈ కర్మ చక్రం చుట్టూనే తిరుగుతుంటాయి.

గ్రహచారం, వాస్తు దోషాల వెనుక దాగున్న కర్మ సూత్రం

సాధారణంగా చాలామంది గ్రహాలు అనుకూలించలేదని, లేదా వాస్తు దోషాల వల్లే కష్టాలు వస్తున్నాయని నమ్ముతారు. కానీ, జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రాలు కూడా పూర్తిగా కర్మ సిద్ధాంతంపైనే ఆధారపడి పనిచేస్తాయి. మన ప్రారబ్ధ కర్మల తీవ్రతను బట్టే ఆయా సమయాల్లో గ్రహాల ప్రభావం మనపై ఉంటుంది. అలాగే మనం ఎలాంటి ఇంట్లో నివసించాలి, ఏ వాస్తు ఉన్న గృహంలో అడుగుపెట్టాలి అనేది కూడా మన పూర్వ కర్మలే నిర్ణయిస్తాయి. కర్మ బలం బాగున్నప్పుడు అన్నీ అనుకూలిస్తాయి, అదే కర్మ దోషం ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా వాస్తు లోపాలు లేదా గ్రహ దోషాల రూపంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

ప్రకృతి నియమం: చర్యకు ప్రతిచర్య.. ఏ విత్తనానికి ఆ పంట!

“చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా” అన్నట్లు.. ప్రకృతిలో ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఒక రైతు వరి విత్తనాలు నాటి, గోధుమ పంటను ఆశించలేడు; ఏ విత్తనం వేస్తే అదే మొలకెత్తుతుంది. మన జీవితం కూడా సరిగ్గా ఇలాంటిదే. సమాజంలో ఇతరులకు ప్రేమ, గౌరవం ఇస్తే మనకు అవే తిరిగి వస్తాయి. అదే మోసం, ద్వేషం గుణిస్తే ఎప్పుడో ఒకప్పుడు వాటి దుష్ఫలితాలను అనుభవించక తప్పదు. ఒక బంతిని గోడకు ఎంత వేగంగా కొడితే, అది అంతే వేగంతో మన వైపుకు దూసుకొస్తుంది. మనం చేసే ప్రతి మంచి, చెడు కర్మలు కూడా కాలక్రమంలో అంతే శక్తితో మన జీవితాల్లోకి తిరిగి వస్తాయి. బ్రహ్మదేవుడైనా ఆ కర్మల ప్రకారమే తలరాత రాస్తాడు తప్ప సొంతంగా ఏదీ మార్చలేడు.

కర్మ బంధాల నుండి విముక్తి పొందడం ఎలా?

మనిషి తెలియక చేసే తప్పుల వల్ల కర్మల భారం పెరిగిపోతుంటుంది. అయితే, ఈ కర్మ బంధాల తీవ్రతను తగ్గించుకోవడానికి శాస్త్రాలు కొన్ని మార్గాలను నిర్దేశించాయి. నిత్య జీవితంలో మంచి ఆలోచనలను అలవర్చుకోవడం, ధర్మబద్ధంగా జీవించడం, సత్యాన్ని పాటించడం ద్వారా కొత్త కర్మలు చుట్టుకోకుండా చూసుకోవచ్చు. ఇతరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా నిస్వార్థంగా సేవ చేయడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడం వల్ల పాత కర్మల ప్రభావం తగ్గుతుంది. వీటన్నింటికీ మించి ఒక ఉత్తమ గురువును ఆశ్రయించి, ఆత్మజ్ఞాన మార్గంలో నడవడం ద్వారా కర్మ బంధాల నుంచి విముక్తి పొందడం సాధ్యమవుతుంది.

సుఖఃదుఖాల ద్వంద్వాతీతం.. జ్ఞానమార్గమే ఏకైక శరణ్యం

జీవితంలో కష్టాలు అస్సలు వద్దు, కేవలం సుఖాలు మాత్రమే కావాలని కోరుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. వెలుగు చీకటిలాగే సుఖం, కష్టం అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. సుఖం ఉన్నచోట కష్టం, కష్టం ముగిశాక సుఖం రావడం ప్రకృతి సహజ సూత్రం. ఈ సుఖఃదుఖాల అనే ద్వంద్వాలను, కర్మల చక్రబంధాన్ని దాటి నిరతిశయ ఆనందాన్ని పొందాలని ఆకాంక్షించేవారు జ్ఞానమార్గాన్ని ఆశ్రయించాలి. మన జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతి మంచి, చెడు సంఘటనకూ మన కర్మలే ప్రధాన కారణమని గ్రహించి, గురువు చూపిన బాటలో నడుస్తూ కర్మల భారాన్ని కరిగించుకోవడమే మానవ జన్మకు సార్థకత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *