“ఛీ”కు చెట్టు ఆకుపచ్చని ఆక్రమణదారు

  • ఈ వృక్ష జాతిని సమూలంగా నాశనం చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం

చీకు చెట్టు (సర్కారు చెట్టు, సీమ తుమ్మ) ఒకప్పుడు కరువు కాలంలో ఆదుకుంటుందని భావించి మనం ఆహ్వానించిన అతిథి చెట్టు. ఈ జాతి నేడు మన జలవనరులను, జీవ వైవిధ్యాన్ని మింగేస్తోంది. మన దేశీయ వృక్షజాతులు వృద్ధి చెందకుండా ఆకుపచ్చని ఆక్రమణదారుగా విస్తరిస్తూ తీరని నష్టం కలిగిస్తోంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చెట్ల విస్తరణ ఇప్పుడు ఒక పర్యావరణ అత్యవసర పరిస్థితిగా మారింది.

అప్పట్లో ఆపద్భందు

1877లో మొదటిసారిగా లండన్ లోని రాయల్ గార్డెన్ నుంచి గింజలను తీసుకువచ్చి భారత్‌లో నాటారు. ఎక్కడైనా పెరిగే లక్షణం ఉండటంతో 1950వ దశకంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ హయాంలో వంటచెరకు కొరత తీర్చడానికి విమానాల ద్వారా గింజలను వెదజల్లారు. అప్పట్లో ఇది ‘బంగారు చెట్టు’గా వెలుగొందింది.

వేల లీటర్ల నీరు ఆవిరి

ఈ చెట్ల వేర్లు భూమిలోకి 100 అడుగుల కంటే ఎక్కువ లోతుకు చొచ్చుకుపోతాయి. ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ చెట్లు రోజుకు వేల లీటర్ల భూగర్భ జలాలను ఆవిరి చేస్తాయి. ఈ చెట్టు ఆకులు, కాయల నుంచి విడుదలయ్యే రసాయనాలు నేల సారాన్ని మారుస్తాయి. దీనివల్ల వేప, రావి వంటి స్థానిక మొక్కలు దీని సమీపంలో మొలవవు. ఇవి పగటిపూట కూడా తక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇతర చెట్లతో పోలిస్తే వీటి కింద గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. దీని ముళ్లు విషపూరితం. అందువల్ల వల్ల పక్షులు వీటిపై గూళ్లు కట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడవు.

మద్రాస్ హైకోర్టు తీర్పులు

మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని దశాబ్ద కాలంగా నిశితంగా పర్యవేక్షిస్తోంది. 2017లో తమిళనాడు రాష్ట్రంలోని అన్ని శీమ కరువేలం(అక్కడ ఇలా పిలుస్తారు) చెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కసారిగా చెట్లను తొలగిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని కొందరు వాదించడంతో దశలవారీ నిర్మూలన విధానాన్ని తీసుకురావాలని కోర్టు సూచించింది. వీటిని తొలగించడం ద్వారా వచ్చే కలప ఆదాయాన్ని తిరిగి అదే ప్రాంతంలో స్థానిక మొక్కలు నాటడానికి ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ, వ్యవస్థాగతమైన పోరాటం ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. ఈ చెట్టు కాయలు తిన్న గేదెలు, మేకల దంతాలు ఊడిపోతున్నాయని, క్రమేణా మరణిస్తున్నాయని ఏపీలోని పశువుల కాపరులు చెబుతున్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఈ చెట్ల విస్తరణ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీతలో భాగంగా వీటిని తొలగిస్తోంది. అయితే, ప్రైవేటు భూముల్లో వీటిని నిర్మూలించడం రైతులకు భారంగా మారింది.

తాత్కాలిక లాభం కొంతే.. శాశ్వత నష్టమే ఎక్కువ

ఈ చెట్టు చుట్టూ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. దక్షిణ భారతదేశంలో హోటళ్లు మరియు పరిశ్రమలకు సరఫరా అయ్యే బొగ్గులో 70% ఈ చెట్టు నుంచే వస్తుంది. బయోమాస్ విద్యుత్ కేంద్రాల్లో ఈ కలపను ప్రధాన ఇంధనంగా వాడుతున్నారు. దీన్ని పూర్తిగా నిషేధిస్తే ఈ రంగాలపై ఆధారపడిన కార్మికుల ఉపాధి దెబ్బతింటుందనే వాదన ఉంది.

శాస్త్రీయ పద్ధతిలో వీటిని నిర్మూలించాలి

భూమిపై 10-15 సెంటీమీటర్ల లోతు వరకు వేర్లను పీకేయాలి. లేదంటే మళ్లీ మొలుస్తాయి. ఖాళీ అయిన ప్రదేశాల్లో వెంటనే వేప, కానుగ, చింత వంటి మొక్కలు నాటాలి. ఏపీలో కూడా తమిళనాడు తరహాలో ఒక సమగ్రమైన పాలసీ తీసుకొచ్చి ఆ ప్రకారం చర్యలు తీసుకుంటేనే ఈ చీకు చెట్లను సమూలంగా నిర్మూలించగలం. చీకు చెట్లు అనేవి ప్రకృతి మనకిచ్చిన శాపం కాదు, మనం చేసిన పర్యావరణ తప్పిదం. మద్రాస్ హైకోర్టు మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మన రాష్ట్రాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగిస్తేనే భవిష్యత్ తరాలకు భూగర్భ జలాలను, పరిశుభ్రమైన గాలిని మిగల్చగలం. దేశీయ వృక్ష జాతులను కూడా వృద్ధి చేసుకోగలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *