_ కుర్రా సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్
ఎల్‌నినో హెచ్చరిక నేపథ్యంలో…
2026లో ఎల్‌నినో వస్తోంది. వర్షాలు తగ్గుతాయి. పంటలు ఎండిపోతాయి. బోర్లు, బావులు ఖాళీ అవుతాయి. గ్రామాలు దప్పికతో, ఆకలితో అలమటిస్తాయి. కానీ ఒక్క విషయం మర్చిపోకండి…ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే సహజ కవచం మన చెరువులే! మీ చెరువు బతికితే… మీ బతుకు బాగుంటుంది. మీ చెరువు చస్తే మీ బతుకు చెడిపోతుంది.
ప్రకృతి ఎప్పటికప్పుడు చెబుతూనే హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ ఆ సంకేతాలను మనం ఎప్పుడూ తేలికగా తీసుకుంటాం. కానీ ఒక దశలో అవే సంక్షోభాలుగా మారి మన ముందుకు వస్తాయి. 2026లో ఎదురయ్యే ఎల్‌నినో పరిస్థితి కూడా అలాంటి హెచ్చరికగానే చూడాలి. వర్షాలు తగ్గుతాయి… పంటలు దెబ్బతింటాయి… నీటి వనరులు క్షీణిస్తాయి… గ్రామీణ జీవనం ఒత్తిడికి లోనవుతుంది. ఈ పరిణామం కేవలం వాతావరణ మార్పు కాదు. మన జీవన విధానాలపై నేరుగా ప్రభావం చూపే వాస్తవం.
ఎల్‌నినో ప్రభావంతో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంస్థలు సూచిస్తున్నాయి. సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాలు ఒకేసారి కురిసి ఆగిపోవడం, తర్వాత చినుకు రాలకపోవడం వంటి పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పప్పులు, పత్తి వంటి పంటలు నీటి కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ వంటి ఎండ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
అయితే సమస్య కేవలం వర్షం తగ్గడంలో మాత్రమే లేదు. వచ్చిన వర్షం నీటిని నిల్వ చేసుకోలేకపోవడం మరింత ప్రమాదకరం. ఇక్కడే చెరువుల ప్రాముఖ్యత ముందుకు వస్తుంది. శతాబ్దాలుగా గ్రామీణ భారతదేశం నిర్మించుకున్న చెరువులు వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను నింపి వ్యవసాయాన్ని నిలబెట్టే సహజ కవచంగా పనిచేశాయి. ఎల్‌నినో వంటి పరిస్థితుల్లో ఇవే గ్రామాలకు జీవనాధారంగా మారగలవు.
చెరువు ఉన్న గ్రామం, వర్షం తగ్గినా నిలబడగలదు. ఒకసారి కురిసిన వర్షాన్ని చెరువు నిల్వ చేస్తుంది. ఆ నీరు నెలల తరబడి ఉపయోగపడుతుంది. అదే నీరు నెమ్మదిగా నేలలోకి చొచ్చుకుపోయి బోర్లు, బావులను నింపుతుంది. వర్షం మధ్యలో ఆగిపోయినా రైతు పంటను నిలబెట్టగలడు. ఈ విధంగా చెరువు ఒక నీటి నిల్వ కేంద్రం మాత్రమే కాదు, ఒక జీవన భద్రతా వ్యవస్థగా ఉంది.
చెరువు లేని గ్రామంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భారీ వర్షం కురిసినా నీరు కొన్ని గంటల్లోనే పారిపోతుంది. కొద్ది రోజులకే బోర్లు ఎండిపోతాయి. పంటలు ఎండిపోతాయి. చివరికి జీవనాధారమే సంక్షోభంలో పడుతుంది. అంటే ఎల్‌నినో ప్రభావాన్ని పెంచేది ప్రకృతి మాత్రమే కాదు మన నీటి నిర్వహణలోని లోపాలీ కూడా!.
ఇక్కడ ఒక కఠినమైన నిజాన్ని అంగీకరించాల్సిందే. మనమే మన చెరువులను బలహీనపరిచాం. మట్టితో నిండిపోయిన చెరువులు, మూసుకుపోయిన కాలువలు, పెరిగిన ఆక్రమణలు అన్నీ కలిసి నీటి నిల్వ సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా ఎల్‌నినో వంటి పరిణామాలు వచ్చినప్పుడు ప్రభావం మరింత తీవ్రమవుతోంది.
చెరువుల పునరుద్దరణ అత్యవసర చర్య
ఈ పరిస్థితుల్లో చెరువుల పునరుద్ధరణను ఇకపై అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా అత్యవసర చర్యగా చూడాలి. పూడికతీత ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం, కాలువలను శుభ్రం చేయడం, ఆక్రమణలను తొలగించడం వంటి పనులన్నీ తక్షణం చేపట్టాలి. ప్రతి నీటి చుక్కనూ నిల్వ చేయగల సామర్థ్యం పెరిగితేనే ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించగలం ప్రభుత్వం, పంచాయతీలు, స్థానికులు అందరూ కలిసి పని చేసినప్పుడే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. చెరువుల సంరక్షణ ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. అదే సమయంలో భవిష్యత్ నీటి భద్రతకు బలమైన పునాది వేస్తుంది. ఇది ఒక కార్యక్రమంగా కాదు ఒక ఉద్యమంగా మారాలి.
” ఎల్‌నినోను మనం ఆపలేం. కానీ దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఆ శక్తి మన సంప్రదాయ జలవ్యవస్థల్లో ఉంది. చెరువులను కాపాడటం అంటే కేవలం నీటిని కాదు మన భవిష్యత్తును కాపాడుకోవటం “.
చివరగా ఒక ప్రశ్న..
మీ గ్రామ చెరువు బతికేలా మీరు ఏం చేస్తున్నారు?
ఎందుకంటే… భవిష్యత్తులో మీ చెరువే మీ బతుకు.












Leave a Reply