యూనివర్సిటీల నిబంధనల సడలింపుపై సామాజికవేత్తల ఆందోళన
– కుర్రా సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు నిబంధనలు సడలిస్తూ ఈ నెల 10వ తేదీ తీసుకున్న నిర్ణయం సాధారణ పరిపాలనా మార్పు కాదు. ఇది ఉన్నత విద్య భవిష్యత్తును, విద్యార్థుల వృత్తి సామర్థ్యాన్ని, సమాజం మొత్తం విద్యా నాణ్యతను నేరుగా ప్రభావితం చేసే కీలక నిర్ణయం. పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధి పేరుతో తీసుకున్న ఈ చర్యను లోతుగా పరిశీలిస్తే ఇప్పటికే ఉన్న బలహీనతలను మరింత పెంచి, విద్యా వ్యవస్థను దీర్ఘకాలికంగా బలహీనపరిచే ప్రమాదం పొంచి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మొదటి నుంచి నిబంధనలు ఎందుకు కఠినంగా ఉండేవి?
యూనివర్సిటీ అంటే కేవలం భవనాల సమూహం కాదు. అది పూర్తి విద్యా వాతావరణం. జ్ఞాన సంపద, పరిశోధన, నైపుణ్యాలు, స్థిరత్వం. కఠిన నిబంధనల వెనుక ఉద్దేశం ఏంటంటే పేరు కోసమో, పరపతి కోసమో, సొంత ప్రయోజనాల కోసమో యూనివర్సిటీలు రాకూడదు. విద్యార్థుల భవిష్యత్తు మధ్యలో నిలిచిపోకూడదు. నాణ్యత, విశ్వసనీయత, దీర్ఘకాలిక స్థిరత్వం ఉండాలి. అందుకే భూమి పరిమాణం 50 ఎకరాలు ఉండాలని, కార్పస్ ఫండ్ అంటే మూలధనం రూ.15కోట్లు ఉండాలని నిర్దేశించారు. ఇలాంటి పెద్ద ప్రమాణాలను అడ్డంకులుగా భావించకుండా విద్యార్థులను రక్షించే భద్రతా కవచాలుగా భావించాలి.
ఇప్పుడు ఏం మారింది?
తాజా సవరణల ప్రకారం భూమి అవసరాన్ని 50 ఎకరాల నుంచి 15 ఎకరాలకు గణనీయంగా తగ్గించారు,. కార్పస్ ఫండ్ పరిమాణం రూ. 15 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గించారు. ఈ వెసులుబాట్లు అంతటితో ఆగలేదు. ప్రవేశాలపై ప్రభుత్వ నియంత్రణను కూడా సడలించారు. ఇది పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన చర్యగా కనిపించొచ్చుగానీ అదే సమయంలో నియంత్రణ వ్యవస్థను బలహీనపరుస్తోంది.
మార్కులపై పర్యవేక్షణ ఎక్కడ?
ప్రస్తుత విద్యావ్యవస్థలో లోపాలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం కేవలం పరీక్షల వరకే చూద్దాం. యూనివర్సిటీలు తమ సొంతంగా పరీక్షలు నిర్వహిస్తాయి, పేపర్లు దిద్దుతాయి, మార్కులు ఇస్తాయి. ఇంటర్నల్ మార్కులపై బాహ్య పర్యవేక్షణ చాలా తక్కువ. సవరణల పేరుతో వెసులుబాటు సృష్టించుకుంటున్న “విద్యావేత్తలు” ఆల్రెడీ ఉన్న వెసులుబాటును వాడుకోకుండా ఉంటారా?
ఫీజుల నియంత్రణ పరిమితం… ఇప్పటికే ఉన్న లోపాలు
ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీజుల నియంత్రణ చాలా పరిమిత స్థాయిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (APHERMC) ద్వారా ప్రభుత్వ కోటా 50% సీట్లకు మాత్రమే ఫీజు నిర్ణయం జరుగుతుంది. మిగిలిన మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, అదనపు కోర్సులు, హాస్టల్/ల్యాబ్/ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు — ఇవన్నీ యూనివర్సిటీల సొంత నిర్ణయానికి వదిలేస్తారు. ఫలితంగా అధిక ఫీజులు, హిడెన్ ఛార్జీలు, ఆర్బిట్రరీ హైకులు సాధారణమవుతున్నాయి. పర్యవేక్షణ సంస్థలు, రాష్ట్ర అధికారులు రియల్ టైమ్ తనిఖీలు చేయలేకపోతున్నారు. UGC 2024 గైడ్‌లైన్స్ ప్రకారం యూనివర్సిటీలు తమ వెబ్‌సైట్‌లో ఫీజు స్ట్రక్చర్, రీఫండ్ పాలసీ, ఫైనాన్షియల్ డీటెయిల్స్ స్పష్టంగా ప్రచురించాలి. కానీ అలా చేయకపోవడంతో 54 ప్రైవేట్ యూనివర్సిటీలకు యూజీసీ గత ఏడాది నోటీసులు ఇచ్చింది. ఈ మెయిల్ రిమైండర్లు, ఆన్‌లైన్ మీటింగులు ఇచ్చినా స్పందన లేదు. యూనివర్సిటీలు “నో ప్రాఫిట్, నో లాస్” ఆధారంగా నడవాలి కానీ ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయా, ఫౌండర్ ఫ్యామిలీకి లాభాలు చేరుతున్నాయా అనేది సరైన ఆడిట్ లేదు.
ఈ నేపథ్యంలో నిబంధనలు మరింత సడలిస్తే ఏమవుతుంది?
- తక్కువ భూమి, తక్కువ పెట్టుబడితో అనేక కొత్త యూనివర్సిటీలు వస్తాయి. పోటీ పేరుతో అడ్మిషన్ల కోసం సులభ పరీక్షలు, హై రిజల్ట్స్, మార్కుల సడలింపు వంటి ధోరణులు పెరగవచ్చు.
- పరీక్షలలో కఠినత్వం తగ్గితే స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపిస్తాయి. డిగ్రీలు ఉంటాయి… కానీ నిజమైన సామర్థ్యం ఉండదు. ఇది యువత భవిష్యత్తును దెబ్బతీస్తుంది.
- యూనివర్సిటీల సంఖ్య పెరిగితే ఇప్పటికే బలహీనంగా ఉన్న పర్యవేక్షణ వ్యవస్థపై నియంత్రణ మరింత బలహీనమవుతుంది. తప్పులు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవడం అలవాటుగా మారిపోతుంది. తర్వాత పర్యవేక్షణ లేకపోవడం కూడా వెసులుబాటుగా కల్పిస్తారు.
- పరీక్షల వ్యవస్థలోని మూల సమస్య ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీల్లో పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాలు అన్నీ యూనివర్సిటీ నియంత్రణలోనే ఉంటాయి. దీనివల్ల మార్కుల విశ్వసనీయతే ప్రశ్నార్థకం అవుతుంది.
అసలు ప్రశ్న ఏంటంటే..!
నిబంధనలు సడలించే ముందు వ్యవస్థను బలపరిచామా? పర్యవేక్షణను కఠినతరం చేశామా? నాణ్యతా ప్రమాణాలపై ఎలా హామీ ఇస్తాము? అనే ప్రశ్నలు ప్రభుత్వం వేసుకుందా? సరైన సమాధానం చెప్పుకొందా? సమాధానాలు ఉంటే అవేంటో కూడా ప్రజలకు తెలియజేయాలి.
నిబంధనలు తగ్గితే యూనివర్సిటీలు పెరుగుతాయి. కానీ నియంత్రణ బలహీనమైతే విద్య విలువ పతనమవుతుంది.












Leave a Reply