ఎటుపోతోంది సమాజం?

మొబైల్ వ్యసనంలో పడి కన్నతల్లిపైనే దాడి చేస్తున్న బాల్యం!

సాంకేతికత మానవ జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చింది, కానీ నేడు అది పిల్లల భవిష్యత్తును విచ్ఛిన్నం చేసే ఒక వ్యసనంగా మారిపోతోంది. స్మార్ట్‌ఫోన్ల మోజులో పడి విచక్షణ మరచిపోతున్న చిన్నారులు, పిచ్చిపట్టిన వారిలా ప్రవర్తిస్తున్నారు. చివరికి ఫోన్ గుంజుకున్నారనో, వాడొద్దన్నారనో కన్నతల్లిపైనే భౌతిక దాడికి దిగేంత ఘోరమైన స్థితికి చేరుకోవడం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.

గతంలో ఇళ్లల్లో పెద్దలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. మంచిచెడులను వివరిస్తూ, సంస్కారం, నైతిక విలువలను నేర్పించేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆత్మీయ అనుబంధాలు మాయమైపోయాయి. పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా ఫోన్ వాడకం ఒక పిచ్చిగా మారిపోవడంతో ఇళ్లల్లో మాటలు తగ్గిపోయి, కేవలం స్క్రీన్లతోనే సమయం గడిపే పరిస్థితి ఏర్పడింది.

టెక్నాలజీ అనేది ఒక అవసరం మాత్రమే, అది జీవితం కాకూడదు. పిల్లలకు కేవలం చేతిలో మొబైల్ ఫోన్ ఇచ్చి బాధ్యత తీరిపోయిందనుకోవడం పెద్ద పొరపాటు. వారికి కావలసింది డిజిటల్ తెరలు కాదు.. తల్లిదండ్రుల ప్రేమ, విలువైన సమయం మరియు మంచి విలువలు. పిల్లలలో మార్పు రావాలంటే ముందుగా పెద్దలు తమ ఫోన్ వాడకాన్ని తగ్గించుకుని, వారి ముందు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది.

రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. అవసరమైనంత వరకే సాంకేతికతను వాడుతూ, పిల్లలతో రోజూ సమయం గడపాలి. వారికి ఆటపాటలు, పుస్తకాలు, మంచి సంభాషణలు అలవాటు చేయాలి. మొబైల్ వ్యసనం అనే మహమ్మారి నుంచి మన పిల్లలను కాపాడుకుని, వారి భవిష్యత్తును బంగారు బాటగా మలచడానికి ఇప్పటికైనా ప్రతీ ఒక్కరూ అడుగు ముందుకు వేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *