ఆ “లక్ష్మి” తన కష్టమా? ఇతరుల నష్టమా?

● కర్నూలు మార్కెట్ కమిటీలో అధికారులపై సంచలన ఆరోపణలు
● జీరో ట్రేడ్ పేరుతో సరుకుల మాయం
● ఉల్లి కొనుగోళ్లలో రూ.80 లక్షల దుర్వినియోగం
● ఆదాయానికి మించిన ఆస్తులపై ఫిర్యాదు?

సాధారణ ఉద్యోగంతో జీవితం ప్రారంభించినవారు క్రమంగా ఎదగడం సహజం. కానీ కొందరి ఎదుగుదల మాత్రం ప్రజల్లో సందేహాలను రేకెత్తించేలా ఉంటుంది. అలాంటప్పుడు ఆ సంపాదన వాళ్ల కష్టంతో వచ్చిందా, కొందరు నస్టపోవడం వల్ల వచ్చిందా అనే అనుమానం తలెత్తుతుంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన ఇద్దరు అధికారులపై తాజాగా ఉన్నతాధికారులకు అందిన ఓ ఫిర్యాదు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది.

జీరో ట్రేడ్ పేరుతో సరుకులు మాయం?
ఫిర్యాదు ప్రకారం మార్కెట్ యార్డుకు వచ్చే సరుకులను పూర్తిగా కంప్యూటర్‌లో నమోదు చేయకుండా వాటిలో కొంత భాగాన్ని “జీరో ట్రేడ్”గా చూపించి బయటకు తరలిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల మార్కెట్ కమిటీకి రావాల్సిన ఫీజులు తగ్గి ప్రభుత్వానికి ఆదాయ నష్టం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉల్లి కొనుగోళ్లలో భారీ అక్రమాలు?
ప్రభుత్వం చేపట్టిన ఉల్లి కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అమ్ముడైన ఉల్లి సరుకును మళ్లీ అమ్మకానికి పెట్టి అదే సరుకును పలుమార్లు ప్రభుత్వానికి విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో సుమారు రూ.80 లక్షల వరకు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎఫ్ఎంఎస్ నిధుల దుర్వినియోగం
రాష్ట్రంలో అమలులో ఉన్న సీఎఫ్ఎంఎస్ ఆర్థిక వ్యవస్థ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. చైర్మన్ లేదా పర్సన్ ఇన్ ఛార్జ్ అనుమతి లేకుండానే మార్కెట్ కమిటీ నిధులను డ్రా చేసినట్లు ఆరోపించారు.

సీసీ కెమెరాలు నిజం చెబుతాయా?
ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోవాలంటే మార్కెట్ కమిటీ కార్యాలయం, సంబంధిత అధికారుల కార్యాలయాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. ఫుటేజీ పరిశీలిస్తే అనేక అంశాలు బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆస్తుల పెరుగుదలపై ప్రశ్నలు
ఫిర్యాదులో మరో ముఖ్య అంశం అధికారుల ఆస్తుల పెరుగుదల. 2008లో సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఉద్యోగంలో చేరిన ఒక అధికారి ప్రస్తుతం భారీ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపించారు. భవంతులు, భూములు, అలాగే పోలో, స్కోడా, ఇన్నోవా వంటి లగ్జరీ కార్లు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజకీయ అండ ఉందా?

ఈ అక్రమాలకు కొంతమంది ప్రభావశీల స్థానిక రాజకీయ నాయకుల అండ ఉందని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. అందువల్లే ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, విజిలెన్స్ విభాగం, అవినీతి నిరోధక శాఖలు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.

తొలికోడి వాత :
తన కష్టంతో సంపాదించినా, తన తెలివితో సంపాదించినా గౌరవం వస్తుంది. కానీ ఇతరులను నష్టపరచడం ద్వారా ఎదిగితే మాత్రం ప్రశ్నల వర్షం కురిపించి అగ్గి రాజేసి బొగ్గు చేసేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *