సమాజంలో పేదవాడి నుండి కోటీశ్వరుడి వరకు అందరి నోటా వినిపించే ఒకే మాట “డబ్బు సరిపోవడం లేదు”. కూలి పనుల వారికి కూలి, ఉద్యోగులకు జీతం, వ్యాపారులకు లాభం, వ్యవసాయం చేసే రైతుకు పంట వచ్చినా ఏదీ చాలడం లేదు. నిజానికి ఇది కేవలం నోట్ల కొరత కాదు, మనిషి సంపాదన కంటే అతని ఆశలు వేగంగా పరుగెత్తడం వల్ల వస్తున్న అసంతృప్తి. శరీరం ప్రస్తుత కాలంలో ఉంటే, మనసు ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తూ రెండడుగులు ముందే ఉంటోంది. వంద రూపాయలు ఉన్నవాడు రెండు వందల ఖర్చులు, లక్ష ఉన్నవాడు రెండు లక్షల పనులు, కోట్లు ఉన్నవాడు వందల కోట్ల వ్యాపారాల కలలు కనడం వల్లే వచ్చిన ఆదాయం ఎప్పటికీ సరిపోవడం లేదు.
కూడు, గుడ్డ, నీడ, పిల్లల చదువు, ఆరోగ్యం అనేవి మనిషి సహజమైన అవసరాలు. కానీ ఈ అవసరాల గీత దాటాక ఆశ అనే మనసు స్వభావం మొదలవుతుంది. ఒక ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు, బైక్ ఉంటే కారు, అది ఉంటే ఖరీదైన కారు కావాలనే కోరికలు నిరంతరం పుడుతూనే ఉంటాయి. సౌకర్యం కోసం మొదలైన జీవిత ప్రయాణం చివరకు పక్కింటి వారితోనో, స్నేహితులతోనో పోల్చుకునే రేసుగా మారిపోతుంది. నేటి సమాజం కూడా మనిషికి తన వద్ద ‘ఉన్నది’ చూపించి సంతోషపడేలా చేయడం లేదు, తన వద్ద ‘లేనిది’ మాత్రమే చూపిస్తూ ఆరాటాన్ని, అసంతృప్తిని పెంచుతోంది.
ఆదాయం పెరుగుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా బాధ్యతలు, భయాలు పెరిగి జీవితంలో ప్రశాంతత కరువవుతోంది. ఒకప్పుడు తక్కువ డబ్బుతోనూ ప్రశాంతంగా, సంతోషంగా ఉన్న మనుషులు, ఇప్పుడు గుట్టల కొద్దీ సంపద ఉన్నా నిద్రమాత్రలు వేసుకోవాల్సిన స్థితికి చేరుకున్నారు. “ఇది పోతే ఎలా? రేపు ఏమవుతుంది? ఇంకా ఎలా సంపాదించాలి?” అనే భవిష్యత్తు గురించిన మితిమీరిన ఆందోళన మనిషిని నిరంతరం పరిగెత్తిస్తోంది. రాబోయే కాలం కోసం నేటి జీవితాన్ని మరిచిపోవడం, వర్తమానాన్ని పూర్తిగా బలి పెట్టేయడం వల్లే సంపాదన ఎంత ఉన్నా లోటుగానే అనిపిస్తోంది.
“ఇంకొంచెం సంపాదిస్తే సంతోషంగా ఉంటాను” అనే ఆశకు జీవితంలో ఎక్కడా ముగింపు ఉండదు. ఒక లక్ష్యం చేరితే ఇంకో లక్ష్యం, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతూనే ఉంటాయి. కోట్ల రూపాయలున్నా మనశ్శాంతి లేనివాడు నిజమైన ధనవంతుడు కాడు; చిన్న ఇంట్లో ఉన్నా అందరూ కలిసి నవ్వుతూ గడిపే కుటుంబమే అసలైన సంపద. ఆశ ఉండవచ్చు కానీ అది మనల్ని బానిసలుగా చేసుకోకూడదు. డబ్బు జీవితం నడపడానికి అవసరమే కానీ డబ్బే జీవితం కాదు కాబట్టి, భవిష్యత్తు కోసం శ్రమిస్తూనే ప్రస్తుతం ఉన్నదానితో సంతృప్తి చెందడం అలవాటు చేసుకున్నప్పుడే ఈ పరుగు ఆగుతుంది.












Leave a Reply