అందరికీ అందుబాటులో మంగళగిరి ఎయిమ్స్
చిన్న జ్వరం, సాధారణ నొప్పి కూడా ఇప్పుడు కుటుంబాలకు ఆర్థిక భారంగా మారింది. కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెట్టగానే డాక్టర్ ఫీజులు, టెస్టులు, స్కాన్లు అంటూ ఒక్కరోజులోనే ₹5000–₹6000 బిల్లు వేయడం సాధారణమైపోయింది. కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బును, కొడుకు చదువు కోసం కూడబెట్టిన సొమ్మును ఒక్క వ్యాధి తినేస్తోంది. ఈ పరిస్థితుల్లో మంచి వైద్యం అంటే ఖరీదైనదేనా అనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్(AIIMS)లో ఈ ప్రశ్నకు బలమైన సమాధానం లభిస్తోంది.
పది రూపాయలు ఉంటే చూపించుకోవచ్చు
విజయవాడ – గుంటూరు మధ్య 183 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ₹1610 కోట్లతో నిర్మించిన ఈ కేంద్ర సంస్థ సామాన్యుడి ఆరోగ్య హక్కును వాస్తవంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ వైద్యం ప్రారంభమయ్యేది కేవలం ₹10తోనే. హాస్పిటల్లోకి వెళ్లగానే ఓపీడీ బ్లాక్‌లో రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఇచ్చి టికెట్ తీసుకుంటే అదే స్లిప్‌తో ఒకే రోజులో అనేక విభాగాల డాక్టర్లను కలవచ్చు. బయట ఒక స్పెషలిస్ట్‌ను కలవడానికి ₹500 నుంచి ₹1,500 వరకు ఖర్చవుతున్న రోజుల్లో, ఇక్కడ అదే సేవ ₹10లో అందుబాటులో ఉండటం కేవలం చవక ధర కాదని, వైద్యం అందరికీ చేరాలని తీసుకున్న విధాన నిర్ణయమని అర్థమవుతుంది.
టెస్టులు అత్యంత చవక, సమయం ఆదా!
అసలు ఆదా ఎక్కడంటే పరీక్షల దగ్గరే కనిపిస్తుంది. బయట కంప్లీట్ బ్లడ్ టెస్ట్‌కు ₹800 ఖర్చవుతుంటే, ఇక్కడ అది ₹135లో పూర్తవుతుంది. లివర్, కిడ్నీ టెస్టులు ₹2000 నుంచి ₹450లోపే, ECG మరియు చెస్ట్ ఎక్స్‌రే ₹700 నుంచి ₹110లోపే, థైరాయిడ్ టెస్ట్ ₹900 నుంచి ₹200కు, మామ్మోగ్రఫీ ₹4000 నుంచి ₹630కు తగ్గిపోవడం వంటి ఉదాహరణలు ఇక్కడ సాధారణమే. ఒక్కరోజులోనే ₹5000–₹6000 వరకు ఆదా కావడం వల్ల, వైద్యం కోసం అప్పులు చేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. అదే రోజు టెస్టులు పూర్తి చేసి రిపోర్టులు అందించే విధానం వల్ల సమయం కూడా ఆదా అవుతోంది.
చులకనగా చూడొద్దు.. గొప్పగొప్ప డాక్టర్లుంటారు
ఇక్కడి వైద్య సేవల నాణ్యత గురించి కూడా స్పష్టత అవసరం. “ఉచితం అంటే నాణ్యత తక్కువ” అనే భావన ఇంకా చాలా మందిలో ఉంది. కానీ All India Institute of Medical Sciences ప్రమాణాల ప్రకారం ఎంపికైన వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. MBBS తర్వాత MD/MS, DM/MCh వంటి ఉన్నత అర్హతలు కలిగి, క్లిష్టమైన కేసులను నిర్వహించిన అనుభవం ఉన్న ఈ డాక్టర్లు టీమ్‌గా కలిసి పనిచేస్తారు. ప్రతి కేసును సీనియర్ వైద్యులు పర్యవేక్షించే విధానం ఉండటం వల్ల చికిత్స నాణ్యతపై రాజీ ఉండదనే నమ్మకం పెరుగుతోంది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, గైనకాలజీ, పిల్లల వైద్యం, కంటి, చెవి-ముక్కు-గొంతు, చర్మం, డెంటల్ వంటి విభాగాలు పని చేస్తుండగా, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీలు కూడా దశలవారీగా బలపడుతున్నాయి. డాక్టర్ అవసరమని భావిస్తే వెంటనే అడ్మిషన్ కూడా కల్పిస్తారు. 960 బెడ్ల సామర్థ్యం, ICU సౌకర్యం, 24 గంటల ఎమర్జెన్సీ సేవలు ఉండటం వల్ల ఇది కేవలం OPD స్థాయిలోనే కాకుండా పూర్తి స్థాయి వైద్య వ్యవస్థగా పని చేస్తోంది. కొన్ని చికిత్సలు ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగా అందుబాటులో ఉండటం కూడా ప్రత్యేకత. వైద్యం మాత్రమే కాదు, వసతుల విషయంలో కూడా ఈ సంస్థ ప్రత్యేకంగా నిలుస్తోంది. పరిశుభ్రమైన వార్డులు, గాలి, వెలుతురు, విశాలమైన ప్రాంగణం, లిఫ్టులు, వీల్చైర్లు, సహాయక సిబ్బంది ఇవన్నీ రోగికి గౌరవం ఇచ్చే విధంగా రూపొందించబడ్డాయి. క్యాంటీన్లో కూడా ₹50–₹80లో భోజనం లభించడం, ఈ వ్యవస్థ సామాన్యుడి అవసరాలను ఎంతగా అర్థం చేసుకుందో చూపిస్తుంది.
సులభంగా వెళ్లొచ్చు
రాకపోకల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. విజయవాడ, గుంటూరు నుంచి బస్సులు ₹10 ప్రయాణంతో అందుబాటులో ఉండగా ఆటోలు ₹30–₹50లో లభిస్తాయి. ఉదయం 9 గంటలకు వెళ్తే టెస్టులు పూర్తి చేసుకుని మధ్యాహ్నానికి ఇంటికి చేరే పరిస్థితి ఉండటం వల్ల రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలామంది ఇంకా ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు. కారణం సమాచార లోపం, అవగాహనా లోపం. “ఎలా వెళ్లాలి? ఎలా చూపించుకోవాలి?” అనే ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్లే ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రోజుకు ఐదారు వేల రూపాయలు ఆదా చేసే అవకాశం ఉన్నా, అది తెలియక పోవడం పెద్ద నష్టంగా మారుతోంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. ఇది “చవక వైద్యం” కాదు, “ఉచిత సేవ” కూడా కాదు, ప్రజల ఆరోగ్యహక్కును ఆచరణలో పెట్టేందుకు ప్రజల డబ్బుతో నిర్మించిన పేద్ద ఆసుపత్రి. దాన్ని చిన్నచూపు చూస్తే మన సొంత వ్యవస్థను మనమే తిరస్కరించినట్టు.














Leave a Reply