రత్నగిరి మెగా రిఫైనరీ కల ఏపీ తీరంలో సాకారం అవుతుందా?

_ ఆకేపాటి శివశంకర్ రెడ్డి

భారతదేశాన్ని గ్లోబల్ ఎనర్జీ మ్యాప్‌పై అగ్రస్థానంలో నిలబెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ఆ సంకల్పానికి పునాది రాయి రత్నగిరి రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (RRPCL). ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో మొదలైన ఈ కల నేడు మహారాష్ట్ర పశ్చిమ తీరంలో ఒక ‘అపరిష్కృత ప్రశ్న’గా మిగిలిపోయింది.

ఆశల తీరం నుంచి ఆందోళనల సుడిగుండంలోకి..!

మొదట్లో ఈ ప్రాజెక్ట్ ఒక ఆర్థిక విప్లవంలా కనిపించింది. ఇండియన్ ఆయిల్, BPCL, HPCL లతో పాటు గ్లోబల్ జెయింట్స్ Saudi Aramco మరియు ADNOC చేతులు కలిపాయి. ఏటా 60 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసే సామర్థ్యంతో రత్నగిరి రూపురేఖలు మారిపోతాయని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. వేల ఎకరాల భూమిని సేకరించడంపై స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తీరప్రాంతం కలుషితమై మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందని, పర్యావరణం కలుషితమవుతుందని వ్యతిరేక స్వరం ఊపందుకుంది. చివరకు జాతీయ హరిత ట్రిబ్యునల్(NGT), బాంబే హైకోర్టులో కూడా కేసులు నడిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు మద్దతు ఇచ్చిన పార్టీలే ఓటు బ్యాంకు కోసం వైఖరి మార్చుకున్నాయి. వీటన్నింటి ఫలితంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు.

మారిన గ్లోబల్ సీన్.. తగ్గిన ఆరామ్కో జోరు

ఒకవైపు స్థానిక సమస్యలు వేధిస్తుంటే, మరోవైపు ప్రపంచ భౌగోళిక రాజకీయాలు మారిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా యద్దం చమురు మార్కెట్‌ను అస్తవ్యస్తం చేసేశాయి. భారీ ప్రాజెక్టులపై ఒకేసారి లక్షల కోట్లు కుమ్మరించడం కంటే, విడివిడిగా చిన్న యూనిట్లలో పెట్టుబడి పెట్టడమే సురక్షితమని ఇన్వెస్టర్లు భావించే పరిస్థితి వచ్చింది.

కొత్త ఆశల వేదిక ఆంధ్రప్రదేశ్?

రత్నగిరిలో సందిగ్ధత కొనసాగుతున్న వేళ, అందరి దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఇది ఈ ప్రాజెక్టుకు బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. భారతదేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఇక్కడ ఉండటం పెట్రోకెమికల్ కారిడార్లకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు కట్టుబడి ఉంది. కాకినాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అడ్వాంటేజ్. రత్నగిరి లాంటి మెగా రిఫైనరీకి బదులుగా ఆంధ్ర తీరంలో దశలవారీగా పంపిణీ చేయబడిన చిన్న రిఫైనరీలు లేదా క్లస్టర్లను ఏర్పాటు చేయడం సౌదీ ఆరామ్కో వంటి సంస్థలకు మేలైన ఆప్షన్‌గా తోస్తోంది.

రత్నగిరి నేర్పిన పాఠం ఏమిటి?

పెట్టుబడులు రావడానికి కేవలం ఎంఓయూలు కుదిరితే సరిపోదు. స్థానికుల సమ్మతి కూడా ఉండాలి. రత్నగిరి ఎపిసోడ్ మనకు మూడు ముఖ్యమైన విషయాలను గుర్తు చేసింది. అవేమిటంటే స్థానికుల విశ్వాసం పొందకుండా ఏ భారీ ప్రాజెక్టూ నిలబడదు. అధికారం మారినప్పుడల్లా పారిశ్రామిక విధానాలు మారకూడదు. పర్యావరణ అనుమతులు, భూసేకరణ వంటి అంశాల్లో ముందే క్లారిటీ ఉండాలి.

ఈ భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ భారత్‌ను వదిలి వెళ్లదు. కానీ అది రత్నగిరి నుంచి మరెక్కడికైనా తరలి వెళ్లే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనుకుంటే, రత్నగిరిలో జరిగిన తప్పిదాలను అధ్యయనం చేసి, ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే ఈ "గ్లోబల్ ఎనర్జీ హబ్" కల ఏపీ తీరంలో సాకారమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *