బాధితుడిగా మిగిలిపోయిన దద్దాల నారాయణ
బాధ్యుడిగా ఎదగలేకపోయిన నాయకత్వం
బెదిరింపుల రాజకీయంతో చివరికి స్వయంగా చిక్కుల్లోకి
కనిగిరి వైసీపీలో అయోమయం
ఇన్చార్జి మార్పు చర్చలు వేగవంతం
కనిగిరి నియోజకవర్గ వైసీపీలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇన్చార్జిగా ఉన్న దద్దాల నారాయణ యాదవ్ నాయకత్వంపై క్యాడర్ నుంచి కీలక నేతల వరకు తీవ్ర అసంతృప్తి పెరుగుతోందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, పార్టీ శ్రేణులు ఇప్పటికీ ఆయనను ఆ స్థాయిలో స్వీకరించలేకపోవడం ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది. 2024 ఎన్నికల్లో స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలిచి టికెట్ ఇచ్చినప్పటికీ, ఆ నమ్మకానికి తగిన ఫలితాన్ని ఇవ్వలేకపోయారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో, బెదిరింపుల రాజకీయానికి దిగి సస్పెన్షన్లపై దూకుడు చూపించడం ఆయనకే నష్టంగా మారింది.
నాయకత్వ లోపాలు – క్యాడర్లో పెరుగుతున్న దూరం
పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలు తప్ప, స్వతంత్రంగా పెద్ద కార్యక్రమాలు చేపట్టలేకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. కనిగిరిలో కీలకమైన యాదవ, రెడ్డి సామాజిక వర్గాల మద్దతు ఉన్నప్పటికీ, వాటిని సమన్వయం చేయడంలో ఆయన విఫలమయ్యారు. కీలక నేతలను కలుపుకొని వెళ్లాల్సిన సమయంలో, విభేదాలను మరింత పెంచేలా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ స్థాయి సమన్వయం, వర్గ రాజకీయాల పరిష్కారం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టమైన లోపాలు కనిపించాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ వ్యతిరేక వర్గాలతో సమన్వయం సాధించలేకపోవడం కూడా ఆయన నాయకత్వ బలహీనతను బయటపెట్టింది. కొన్ని కీలక కార్యక్రమాలకు గైర్హాజరు కావడం, కీలక సమయాల్లో అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కూడా అసంతృప్తిని పెంచాయి.
ఫామ్ హౌస్‌లో పార్టీ కార్యాలయం
కనిగిరి టౌన్లో ఉన్న పార్టీ కార్యాలయాన్ని ఊరి చివర ఉన్న తన ఫామ్ హౌస్‌కు మార్చడం ఆయన చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నారు. టౌన్లోనే కార్యాలయం ఉంటే కార్యకర్తలకు సులభంగా అందుబాటులో ఉండేదని, కానీ ఈ మార్పుతో కార్యకర్తలు దూరమయ్యారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇన్చార్జి మార్పు దిశగా అడుగులు…?
ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, ఇన్చార్జి మార్పు చర్చలు తెరపైకి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన క్యాడర్, అసంతృప్తితో ఉన్న నేతలు మొత్తం కలిసి ఒక కొత్త సమీకరణానికి దారితీసే అవకాశం ఉంది.ఇప్పుడు అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే కనిగిరి వైసీపీలో భవిష్యత్తు ఆధారపడి ఉంది.












Leave a Reply