ఏకశిలా నగరంగా, ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా కొందరు అర్చకులు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దైవ కార్యాల్లో నిమగ్నం కావాల్సిన అర్చకులు, రాజకీయ నాయకుడి గడప తొక్కిన వైనంపై టీటీడీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ పర్యటన.. వేద మంత్రాల ఆశీర్వచనం!
ఇటీవల ఒంటిమిట్ట ఆలయానికి చెందిన కొందరు అర్చకులు కడప జిల్లా పులివెందులకు వెళ్లారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ మర్యాదలు, సంప్రదాయాల ప్రకారం అర్చకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి రాజకీయ నాయకులను ప్రత్యేకంగా కలవడం నిషిద్ధం. అయితే, ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్చకులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యూనియన్ చాటున తప్పించుకునే ప్రయత్నం?
ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు వివరణ కోరగా, అర్చకులు వింత వాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అర్చకుల సంఘం మరియు జిల్లా యూనియన్ నాయకులు పిలిచినందువల్లే తాము వెళ్ళామని, అది యూనియన్ తరపున జరిగిన పర్యటనే తప్ప వ్యక్తిగతమైంది కాదని చెప్పుకొచ్చారు. అయితే, యూనియన్ కార్యక్రమాల పేరుతో ఆలయ హోదాను వాడుకోవడంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ!
ఈ ఘటనను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించిన టీటీడీ ఉన్న తాధికారులు సదరు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అర్చకుల వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టీటీడీ తీసుకోబోయే తదుపరి చర్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.












Leave a Reply