_ కుర్రా సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్
రామయ్య గారికి ఇద్దరు కొడుకులు రాజు, రాము. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు. అదే ఆవరణలో ఆడుకున్నారు, అదే వెలుతురులో చదువుకున్నారు, అదే తలుపు దాటి బయట ప్రపంచాన్ని చూసారు. వాళ్లిద్దరికీ ఒకే భావన “ఈ ఇల్లు మనిద్దరిదీ” అని.ఒక రోజు రామయ్య గారు వారిని పిలిచాడు. “ఇక మీ ఇద్దరికీ ఇల్లు విడిగా ఇస్తాను” అని చెప్పాడు. ఇల్లు రెండు భాగాలుగా విభజించాడు. ముందుభాగం రాజుకి, వెనుకభాగం రాముకి ఇచ్చాడు. ఇద్దరికీ తాళాలు ఇచ్చి, “ఇక మీ భాగం మీది” అన్నాడు. మొదట ఇద్దరూ ఆనందపడ్డారు. “మనకూ ఓ భాగం వచ్చింది” అనుకున్నారు.రోజులు గడిచాయి. నెమ్మదిగా తేడా కనిపించడం మొదలైంది. రాజు ఉన్న ముందుభాగంలో పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ దగ్గరికి వాళ్లు వస్తూ పోతూ ఉంటారు. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రాజుకి దొరుకుతూనే ఉన్నాయి. బయట ప్రపంచం అతనికి దగ్గరగా మారింది. అతను అడుగు బయట పెడితే మార్గాలు కనిపించాయి.రాము ఉన్న వెనుకభాగంలో మాత్రం చిన్న తలుపు మాత్రమే ఉంది. అక్కడికి ఎవరూ అంతగా రారు. బయటకి వెళ్లాలంటే తిరిగి తిరిగి వెళ్లాలి. కొత్త అవకాశాలు అతనికి తక్కువగా కనిపించాయి. అతను ఎంత ప్రయత్నించినా, అతని ప్రపంచం ఆ భాగంలోనే ఇరుక్కుపోయింది.ఒక రోజు రాము తట్టుకోలేక తండ్రి దగ్గరకు వచ్చాడు. “నాన్నా… నేను కూడా ముందుభాగం గేట్ నుంచి బయటకి వెళ్లొచ్చా? అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా ప్రయత్నిస్తాను” అని అడిగాడు.రామయ్య గారు నెమ్మదిగా అన్నాడు, “లేదు రామూ… అది నీ భాగం కాదు. నీకు వెనుక తలుపే ఉంది. అదే నీ దారి.”అప్పుడు రాము కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత నెమ్మదిగా అడిగాడు, “నాన్నా… మన ఇల్లు ఒకటే కదా? అయితే బయటకి వెళ్లే దారులు ఎందుకు వేరు?”ఆ ప్రశ్నకు రామయ్య గారు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఇల్లు పంచినప్పుడు ఆయన భాగాలు సమానంగా ఇచ్చానని అనుకున్నాడు. కానీ బయట ప్రపంచానికి కలిపే తలుపులు మాత్రం సమానంగా ఇవ్వలేదని ఆయనకే అప్పుడు అర్థమైంది.ఆ రోజు నుంచి రాముకి ఒక విషయం స్పష్టమైంది. తనకు కూడా ఇల్లు ఉంది, తనకూ హక్కు ఉంది. కానీ అవకాశాల దారి మాత్రం చిన్నదిగా ఉంది. అదే తేడా అతని భవిష్యత్తును నెమ్మదిగా మార్చుతోంది.“ఇల్లు ఒకటే అయినా… బయటికి తీసుకెళ్లే తలుపు ఎవరిదో, అదే వాళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
(నోట్ : రాజుది మల్టీజోన్ 1, రాముది మల్టీజోన్ 2)












Leave a Reply