లీటరు మైలేజీ 170+

_ కుర్రా సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్

పెట్రోల్ సెగలు సామాన్యుడి జేబును దహిస్తున్న తరుణంలో, లీటరుకు 170 కిలోమీటర్ల మైలేజ్ అనేది కేవలం ఒక సంఖ్య కాదు… అది ఒక ఆశ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతానికి చెందిన మెకానిక్ మాంత్రికుడిగా పేరున్న శైలేంద్ర కుమార్ సింగ్ గౌర్ చేసిన ‘సిక్స్-స్ట్రోక్’ ఇంజిన్ ప్రయోగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నిశ్శబ్ద పోరాటం – నిశిత పరిశోధన

గత రెండు దశాబ్దాలుగా ఒకే లక్ష్యంతో, ఎటువంటి కార్పొరేట్ మద్దతు లేకుండా గౌర్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. ప్రయాగ్‌రాజ్‌లో ఒక చిన్న వర్క్‌షాప్‌నే తన ప్రయోగశాలగా మార్చుకున్న ఈయన సుమారు 20 ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ‘సిక్స్-స్ట్రోక్’ ఇంజిన్ నమూనాను సిద్ధం చేశారు. సాధారణంగా వాహనాల ఇంజిన్లు నాలుగు స్ట్రోక్‌లతో పని చేస్తాయి. కానీ గౌర్ రూపొందించిన ఇంజిన్‌లో అదనంగా రెండు స్ట్రోక్‌లను చేర్చడం ద్వారా ఇంధనాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించే విధానం అమలు చేశానని ఆయన చెబుతున్నారు. ఇంధనం పూర్తిగా మండేలా వ్యవస్థను మార్చడం వల్ల వృథా అయ్యే శక్తి తగ్గి అదే ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణం సాధ్యమవుతుందని, ఫలితంగా లీటరుకు 170 కిలోమీటర్ల మైలేజ్ సాధ్యమని ఘంటాపథంగా చెబుతున్నారు.

మల్టీపర్పస్ మరో విశిష్టత

శైలేంద్ర గౌర్ ఆవిష్కరణలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ ఇంజిన్ కేవలం పెట్రోల్‌కే పరిమితం కాదు. ఇది కిరోసిన్ లేదా డీజిల్‌తో కూడా సమాన సామర్థ్యంతో పని చేస్తుందని ఆయన ప్రయోగాత్మకంగా చూపించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన పేటెంట్ కూడా పొందారు. స్థానిక పాలకులు, మాజీ గవర్నర్ల ప్రశంసలు కూడా అందుకున్నారు. అయినప్పటికీ ఈ టెక్నాలజీ సామాన్యుడి దరికి చేరడంలో ఇప్పటికీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.

వ్యవస్థాగత జాప్యం – పారిశ్రామిక వైఖరి

మన దేశంలో ఇలాంటి ఆవిష్కరణలు నీతి ఆయోగ్ వంటి సంస్థల దృష్టికి వెళ్లినా అవి వాణిజ్య రూపం దాల్చడానికి ‘సిస్టమ్’ మద్దతు ఆశించినంత వేగంగా ఉండదు. భారీ పెట్టుబడులతో నడిచే ఆటోమొబైల్ కంపెనీలు, ఒక కొత్త ఇంజిన్ డిజైన్‌ను స్వీకరించడానికి వెనుకాడతాయి. ఎందుకంటే అది వారి ప్రస్తుత తయారీ పద్ధతులను, విడిభాగాల సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చాల్సి వస్తుంది. ఫలితంగా ప్రయాగ్‌రాజ్ వంటి ప్రాంతాల నుండి పుట్టుకొచ్చే మేధస్సు, మార్కెట్లోకి చేరకముందే నిరుత్సాహానికి గురవుతోంది.

మైలేజీ నిలకడగా ఉంటుందా?

ఏ ఆవిష్కరణ అయినా ప్రయోగశాల నుండి రోడ్డు మీదకు రావడానికి మధ్యలో ‘ధృవీకరణ’ అనే అగ్నిపరీక్ష ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో ARAI (Automotive Research Association of India) వంటి సంస్థల కఠినమైన పరీక్షలు, ఇంజిన్ యొక్క మన్నిక, కాలుష్య ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలు అత్యంత కీలకం. సిద్ధాంతపరంగా 170 కిలోమీటర్ల మైలేజ్ అద్భుతమే అయినా అది వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే వాహనాల్లో ఎంతవరకు నిలకడగా ఉంటుందనేది శాస్త్రీయంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది.

పట్టాలెక్కించడం సామాజిక బాధ్యత

శైలేంద్ర గౌర్ ఆవిష్కరణను మనం గుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు, అలాగని తృణీకరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక సామాన్యుడు ఇరవై ఏళ్ల శ్రమను ధారపోసి ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నప్పుడు దాన్ని పరీక్షించి లోపాలుంటే సరిదిద్ది పట్టాలెక్కించడం సామాజిక బాధ్యత. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు చొరవచూపేలా చేయడం కోసం మీడియాలో, సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలను లైక్ చేయడం, షేర్ చేయడం, చర్చించడం ప్రతి పౌరుడూ కర్తవ్యంగా భావించాలి.

గత అనుభవాలు ఒక హెచ్చరిక​

ఇలాంటి ఆవిష్కరణలు వెలుగులోకి రావడం మన దేశానికి కొత్తేమీ కాదు. గతంలోనూ ఎందరో మేధావులు అద్భుతమైన పరిష్కారాలతో ముందుకొచ్చారు. కానీ అవి వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు.​

రామర్ పిళ్లై ‘మూలికా పెట్రోల్’: తొంభైల చివరలో తమిళనాడుకు చెందిన రామర్ పిళ్లై ఆకు అలములతో పెట్రోల్ తయారు చేస్తానని దేశాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు. కానీ శాస్త్రీయ పరీక్షల్లో అది నిలబడలేకపోయింది. సరైన శాస్త్రీయ ధృవీకరణ లేకపోతే ఎంతటి ఆశలైనా ఎలా నీరుగారిపోతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.​

టాటా మోటార్స్ ‘ఎయిర్ కార్’ (Air Pod): గాలితో నడిచే కారును తయారు చేస్తామని, ఇది మైలేజీ సమస్యకు శాశ్వత పరిష్కారమని ఒకప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. లక్సెంబర్గ్ కంపెనీతో కలిసి టాటా మోటార్స్ చేసిన ఈ ప్రయత్నం, ఆచరణలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల వల్ల ఇప్పటికీ సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు.​

హైడ్రోజన్ కిట్లు: నీటితో బండి నడుపుతామని గల్లీ మెకానిక్ నుండి ఇంజనీర్ల వరకు చాలా మంది ప్రయోగాలు చేశారు. కానీ హైడ్రోజన్‌ను నిల్వ చేయడం, భద్రత వంటి అంశాల దగ్గర ఈ ఆవిష్కరణలు ఆగిపోయాయి.

ఆవిష్కర్త: శైలేంద్ర కుమార్ సింగ్ గౌర్

ప్రాంతం : ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), ఉత్తరప్రదేశ్.

విశేషం: 6-స్ట్రోక్ ఇంజిన్ రూపకల్పన, 170 కి.మీ. మైలేజ్ క్లెయిమ్, మల్టీ-ఫ్యూయల్ సపోర్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *