ప్రకృతి కొన్నిసార్లు ఊహకందని మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా మంచు కొండల మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సరిగ్గా ఇలాంటిదే ఒక అద్భుతం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 2021లో అదృశ్యమై, అందరూ మరణించిందని భావించిన ఒక రష్యన్ యువతి, నాలుగు ఏళ్ల తర్వాత నేపాల్‌లోని ఒక పురాతన మఠంలో సన్యాసినిగా కనిపించింది.
2021లో రష్యాకు చెందిన 24 ఏళ్ల అలీనా వెట్రోవా, అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కు ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లి అదృశ్యమైంది. మూడు వారాల పాటు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో, భారీ హిమపాతంలో ఆమె మరణించి ఉంటుందని అధికారులు ధృవీకరించారు. ఆమె తల్లిదండ్రులు స్వదేశంలో ప్రతీకాత్మక అంత్యక్రియలు కూడా నిర్వహించి, కన్నీరు మున్నీరయ్యారు.

2025 ప్రారంభంలో నేషనల్ జియోగ్రాఫిక్ జర్నలిస్టుల బృందం, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల్లోని మఠాలపై డాక్యుమెంటరీ తీస్తుండగా, సముద్ర మట్టానికి 4,800 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ఆలయంలో ఒక వింత దృశ్యం కనిపించింది. బర్గండీ రంగు సన్యాసి వస్త్రాలు ధరించి, తల నీలాలు సమర్పించి, టిబెటన్ భాషను అనర్గళంగా మాట్లాడుతున్న ఒక యూరోపియన్ యువతిని వారు గుర్తించారు. నిశితంగా పరిశీలిస్తే ఆమె నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన అలీనా అని తేలింది!
అప్పట్లో తీవ్రమైన చలికి, ఆక్సిజన్ లేక అలీనా స్పృహ తప్పి పడిపోగా.. అక్కడి ఏకాంతవాసి సన్యాసులు ఆమెను కాపాడారు. హిమాలయ ఔషధ మూలికలతో ఆమెకు ప్రాణం పోశారు. అప్పట్లో మంచు వల్ల దారి మూసుకుపోవడంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆమెకు బౌద్ధ ధ్యానం, టిబెటన్ వైద్యంపై మక్కువ కలిగింది.
అలీనాకు ఒక అరుదైన శక్తి ఉందని అక్కడి సన్యాసులు నమ్ముతారు. కేవలం వాసన ద్వారా అత్యంత అరుదైన పర్వత ఔషధ మూలికలను ఆమె గుర్తించగలదు. అందుకే ఆమెను ఒక పునర్జన్మ పొందిన ఆత్మగా భావించి, ‘టెన్జిన్ డోల్మా’ అని పేరు పెట్టారు. దాదాపు 40 ఏళ్లుగా ఎవరూ నిర్వహించని మఠ ఔషధశాల బాధ్యతలను ఇప్పుడు ఆమె నిర్వహిస్తోంది.

“నేను ఇప్పటికే నా ఇంట్లోనే ఉన్నాను. పర్వతాలు ఎవరిని ఎంచుకుంటాయో వారిని బయటకు వెళ్లనివ్వవు.” – జర్నలిస్టులతో అలీనా చెప్పిన మాటలివి.
అలీనా బతికే ఉందన్న వార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన కాఠ్మాండూ చేరుకున్నారు. నాలుగేళ్ల వియోగం తర్వాత ఈ నెలాఖరులో వారు తమ కుమార్తెను కలుసుకోబోతున్నారు. అయితే, ఆమె తిరిగి రష్యాకు వస్తుందా? లేక హిమాలయాల్లోనే సన్యాసినిగా ఉండిపోతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Leave a Reply