నగరాల్లో బతుకు బండారం
పల్లెల్లో ఊపిరి నిండిన జీవితం
డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లు, సర్టిఫికేట్లతో జీవితాన్ని గెలుస్తామనుకున్న విద్యావంతులు… నగరాల గజిబిజి జీవితంలో చిక్కుకుని “వెట్టిచాకిరీ” చేస్తోన్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిష్ట కోసం, “సిటీ లైఫ్” అనే మాయ కోసం పల్లెలను వదిలి వచ్చిన వారు… ఇప్పుడు కనీస వేతనాలతో బతుకుబండిని లాగడమే పెద్ద సవాలుగా మారింది.నగరాల్లో ఉద్యోగం అంటే స్థిరత్వం, గౌరవం, అభివృద్ధి అనుకున్న వారు… వాస్తవానికి అద్దె ఇళ్లకు అరకొర జీతం చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్ బిల్లులు, నీటి చార్జీలు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, అనారోగ్యానికి హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కలిపి చూస్తే నెల జీతం చేతిలో మిగలడం లేదనే వాస్తవం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. “చదివాం… ఉద్యోగం వచ్చింది… కానీ ఆ జీతంతో బతుకుతామా?” అనే ప్రశ్నతోనే చాలా మంది యువత జీవితం సాగుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు రోజుకు 10-12 గంటలు కష్టపడుతున్నా, ఆ కష్టానికి సరిపోయే జీవన నాణ్యత మాత్రం అందడం లేదు. “ప్రెస్టీజ్” కోసం మొదలైన ప్రయాణం… ఇప్పుడు బాధ్యతల భారంగా మారింది.
ఇదే సమయంలో పల్లెల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఒక పూట కష్టపడితే, కనీస అవసరాలు తీరేలా జీవనం ఉంది. స్వచ్ఛమైన గాలి, శారీరక శ్రమతో వచ్చే ఆరోగ్యం, తక్కువ ఖర్చుతో సంతోషంగా బతికే అవకాశం—ఇవి పల్లెల్లో ఇంకా జీవిస్తున్న వాస్తవాలు. పల్లె జీవితం అంటే వెనుకబాటు అనే భావనతో నగరాలకు పరుగులు తీసిన యువత… ఇప్పుడు తిరిగి ఆలోచించే దశకు చేరుకున్నారు. “స్వంత ఊర్లో చిన్న పని అయినా మంచిదే కానీ నగరంలో ఈ బానిస జీవితం వద్దు” అనే భావన నెమ్మదిగా పెరుగుతోంది.సామాజికంగా చూస్తే ఇది ఒక పెద్ద హెచ్చరిక. చదువు, ఉద్యోగం, అభివృద్ధి అన్నవి మనిషి జీవితాన్ని మెరుగుపరచడానికి ఉండాలి గానీ… బతుకే భారంగా మారే స్థితి రావడం వ్యవస్థలో లోపాలనే సూచిస్తోంది.
ప్రశ్న ఒక్కటే: విద్య మనిషిని విముక్తి వైపు నడిపించాలా… లేక వెట్టిచాకిరీ వైపు తోసేయాలా?












Leave a Reply