ఎంతమంది మీసం మెలేసి బతగ్గలరు?

బాపట్ల కలెక్టర్ తీరు సమాజానికి ఒక సందేశం

కుర్రా సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్

సమాజంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడానికి ఎన్ని కారణాలున్నా మూల కారణం మాత్రం దమ్మూ ధైర్యం లోపించడమే! ధైర్యం అంటే ఆరు గొడవలు, మూడు కేసులు కాదు, మీసం మెలేసి బతకడం, కాలర్ ఎగరేసి తిరగడం లాంటి ఎవరైనా చేయగల చాలా సింపుల్ పనులు కూడా ధైర్యాన్ని సూచిస్తాయి. ఒకప్పుడు ఇలాంటివారు చాలామంది ఉండేవారు. ఇప్పుడు కనుమరుగయ్యారు. ఎంత తప్పు చూసినా ఎదురు మాట్లాడే దమ్మూ ధైర్యం లేదు, ఒత్తిడులకు తట్టుకునే గుండె నిబ్బరమూ లేదు. ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా ఇవి తగ్గాయి. ఫలితంగా వారు రాజకీయ ఒత్తిడులకో, డబ్బు సంచులకో లొంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కలెక్టర్ మీసం మెలేసి మరీ డ్యూటీ చేయడం మామూలు విషయం కాదు. అదేం పెద్ద విషయం అనుకునే ఎవరైనా మీసం మెలేసి నాలుగు రోజులు బతకడానికి ప్రయత్నించండి, మీకే అర్ధమైపోతుంది.

అధికారులకు దిక్సూచి.. ప్రజలకు ప్రేరణ
ఇక బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విషయానికొస్తే ఒక కలెక్టరుగా మీసం మెలేసి కూర్చోవడం అంత సులభం కాదు. దీనివల్ల మేమే గొప్ప అనుకునే వారికి ఎంతోమందికి అకారణ ద్వేషం పుట్టుకొస్తుంది. అలా బతకలేని అధికారులకు కంటగింపుగా మారుతుంది. ఇలాంటి సమస్యలను ఖాతరు చేయకుండా తన బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు తలవంచకుండా, ఒత్తిడులకు లోబడకుండా నిలబడగలనని ఆయన తన వ్యవహారశైలితో తెలియజేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో చాలాసార్లు “సర్దుకుపోవడం” అనే సంస్కృతి కనిపిస్తుంది. కానీ ఈ కలెక్టర్ తీరు మాత్రం ఆ సర్దుబాటుకు భిన్నం. తప్పు అనిపిస్తే నేరుగా నిలబడటం, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయడం ఇవే ఇప్పుడు ప్రజల్లో చర్చకు వస్తున్న అంశాలు. అందువల్లే ఆయన సోషల్ మీడియా మద్దతు, ముఖ్యమంత్రి ప్రశంస పొందగలిగారు. ఒక అధికారి తన బాధ్యతను దైర్యంగా నిర్వర్తిస్తే అది ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంది. అధికారుల్లో “ఇలా కూడా పనిచేయొచ్చా?” అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. సమాజంలో దైర్యం తగ్గిపోయిన ఈ సమయంలో ఇలాంటివి ప్రజలు దైర్యాన్ని కూడదీసుకోవడానికి ఒక ప్రేరణగా పని చేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

………………………………………………………………………………………………………..

వైద్యుడి నుంచి కలెక్టర్‌ వరకు

  • డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐఏఎస్ స్ఫూర్తిదాయక ప్రయాణం

చాలామంది ఒక గొప్ప వృత్తిలో స్థిరపడాలని కలలు కంటారు. కానీ, కొందరు మాత్రం తాము ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, సమాజం కోసం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. అలాంటి వారిలో ఒకరే బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ .

చిన్ననాటి కల – సేవా పథం
కర్ణాటక రాష్ట్రంలో 1989, డిసెంబర్ 16న జన్మించిన వినోద్ కుమార్ గారు చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవారు. క్రమశిక్షణ, అంకితభావం ఆయన నరనరాల్లో జీర్ణించుకున్నాయి. సమాజానికి సేవ చేయాలనే తపనతో ఆయన మొదట వైద్య వృత్తిని ఎంచుకున్నారు.

వైద్యుడిగా విజయం.. కానీ గమ్యం వేరే!
బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో MBBS పూర్తి చేసి 2014లో డాక్టరయ్యారు. ఒక డాక్టర్‌గా రోగుల ప్రాణాలు కాపాడటం గొప్ప విషయమే, కానీ ఆయన ఆలోచనలు ఇంకా విస్తృతంగా ఉండేవి. కేవలం ఆస్పత్రి గదులకే పరిమితం కాకుండా, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన నిర్ణయించుకున్నారు.

సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు
వైద్య విద్య పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా UPSC లక్ష్యంగా కష్టపడ్డారు. తన మొదటి ప్రయత్నంలోనే, 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 291వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.

ప్రజా సేవలో ఒక ధ్రువతార
కేవలం 36 ఏళ్ల చిన్న వయస్సులోనే పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన, ప్రస్తుతం బాపట్ల జిల్లా కలెక్టర్‌గా జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక డాక్టర్‌కు ఉండాల్సిన సహనం, ఒక ఐఏఎస్ అధికారికి ఉండాల్సిన దూరదృష్టి కలగలిసిన వ్యక్తిత్వం ఆయనది.

యువతకు ఇచ్చే సందేశం
“లక్ష్యం ఏదైనా కావచ్చు.. దానికి నిరంతర కృషి, అంకితభావం తోడైతే విజయం మీ బానిస అవుతుంది” అని డాక్టర్ వినోద్ కుమార్ గారి ప్రయాణం నిరూపిస్తోంది. ఒక చేత్తో స్టెతస్కోప్ పట్టిన ఆయన, నేడు మరో చేత్తో వేలాది మంది ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే కలం చేతబట్టి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

ప్రా నిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *